Mana Enadu : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Telangana Phone Tapping Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఉన్నతాధికారులు, జడ్జిలు, చివరకు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తేల్చేందుకు తాజా కాంగ్రెస్ సర్కార్ ఓ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది.
అక్రమ కేసులో వేధించారు
అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీఎస్‌లో బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు(Harish Rao)పై కేసు నమోదు అయింది. హరీశ్‌తో పాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్ రావుపై రియల్ ఎస్టేట్ డీలర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి హరీశ్ రావు, పోలీసు ఉన్నతాధికారులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నా ఫోన్ ట్యాప్ చేశారు
చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావు, Ex డీసీపీ రాధాకిషన్(DCP Radha Kishan) పై కేసు నమోదు చేశారు. చక్రధర్ తన ఫిర్యాదులో తన ఫోన్ ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 120(బి), 386, 409,506 సెక్షన్ల కింద, అలాగే రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ కింద హరీశ్ రావుపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదు అయింది. దీనిపై మాజీ మంత్రి (Harish Rao Case) స్పందించాల్సి ఉంది.






