తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖలు కేటాయించిన ప్రభుత్వం.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్ అండ్ యూత్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్‌కు SC, ST, మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) హోంశాఖను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.
అనుభవం కలిగిన భట్టి వైపే మొగ్గు
మంత్రివర్గ విస్తరణలో తన వద్ద ఉన్న శాఖలనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు కేటాయించారు. ఈ ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి హోంశాఖను అప్పగించకుండా ఇతర శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ నాయకుల శాఖల్లో మార్పు ఉండనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఎవరి శాఖను ఎవరికి బదిలీ చేస్తారని రాజకీయ వర్గాలతోపాటు ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుభవం కలిగిన భట్టి విక్రమార్కకు హోంశాఖ అప్పగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
కాగా భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2023 డిసెంబరు 7 నుంచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఆర్థికశాఖపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. దీంతో భట్టిని ఇటీవల ఢిల్లీకి పిలిపించుకున్న పార్టీ హైకమాండ్.. విస్తృతంగా చర్చలు జరిపి ఆయన ఇష్ట ప్రకారం హోంశాఖ కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ!
ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాల నేపథ్యంలో క్యాబినెట్లో చోటు దక్కక అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ పెద్దలు బుజ్జగించారు. రాజగోపాల్‌తోపాటు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్, విజయశాంతికి కూడా నేతలు ఓదార్చారు. అయితే వారికి అధిష్ఠానం ఇతర పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శాఖల మార్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.






