
Mana Enadu : దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు (Delhi Elections 2024) సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
మనీలాండరింగ్ వ్యవహారంలో దిల్లీ మద్యం కేసులో (Delhi Excise Policy) కేజ్రీవాల్ ఇంతకుముందు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయణ్ను విచారించేందుకు ఈనెల 5వ తేదీన ఎల్జీని ఈడీ అనుమతులు కోరింది. సీఆర్‌పీసీ ప్రకారం.. మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రజాప్రతినిధులను విచారించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరన్న విషయం తెలిసిందే. అందుకే ఎల్జీని అనుమతులు కోరారు.
ఇటీవల ఈ కేసులో తనపై విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కేజ్రీవాల్ హైకోర్టు (Kejriwal High Court)ను అభ్యర్థించారు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. కాగా దిల్లీ మద్యం విధానానికి (Liquor scam case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 27వ తేదీ నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న ఆయన సెప్టెంబరులో బెయిల్ పై బయటకు వచ్చారు.