
ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రతి రోజు హైదరాబాదుకి తరలివస్తున్నారు. ఉద్యోగం కోసం కుటుంబాల నుండి దూరంగా ఉంటూ మానసికంగా, ఆర్థికంగా బాధపడుతూ ఎన్నో నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి పట్టణంలో నివాసం ఉంటున్న వారి కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)(GHMC) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఉపాధి కోసం వెతుకుతున్నవారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తూ, వారికి భోజనంతో పాటు నివాసాన్ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ కృషిలో జీహెచ్ఎంసీ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందడుగు వేసింది.
గ్రేటర్ పరిధిలో 18 ఉచిత షెల్టర్లు
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొత్తం 18 ఉచిత షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు 600 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ నివాసముంటున్నవారు ఆధార్ కార్డు చూపిస్తే చాలు, భోజనంతో కూడిన వసతిని ఉచితంగా పొందవచ్చు. ఆధార్ కార్డు లేనివారికీ కూడా ప్రవేశం కల్పిస్తున్నారు.
షెల్టర్లు ఎక్కడ ఉన్నాయి?
ఈ షెల్టర్లు ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల సమీపంలో ఏర్పాటు చేయబడినవి.
పురుషుల కోసం షెల్టర్లు: బేగంపేట (రెండు కేంద్రాలు), లింగంపల్లి, అఫ్జల్‌గంజ్, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, టపాచబుత్ర తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
మహిళల కోసం ప్రత్యేక షెల్టర్లు: ఉప్పల్, దిల్సుఖ్నగర్, గోల్నాకలో ఏర్పాటు చేశారు.
గాయాలైన పురుషుల కోసం అర్బన్ హోమ్‌లెస్ షెల్టర్ బేగంపేటలో ఉంది. ఇది అమన్ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడికి వారానికి మూడు సార్లు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి వైద్యులు వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు.
షెల్టర్ నిబంధనలు
షెల్టర్లలో తాత్కాలికంగా ఆరు నెలల వరకు నివాసం(Accommodation) ఉండవచ్చు. ఉద్యోగం దొరకని పక్షంలో మరో రెండు నెలల పాటు సడలింపు ఇస్తారు. ఉద్యోగ అవకాశాల కోసం షెల్టర్ నిర్వాహకులే సహాయం చేస్తారు. ప్రతి రోజు ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం(Food) ఉచితం(Free)గా అందజేస్తారు. వంట మరియు పరిశుభ్రత నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను నియమించారు.
మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ
వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనవుతున్నవారికి వారానికి రెండుసార్లు కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆయా వ్యక్తుల పరిస్థితిని బట్టి మానసికంగా ధైర్యం చెప్పేలా మద్దతిస్తారు. అంతేకాకుండా, షెల్టర్లలో నివసించే వారి పుట్టినరోజులను జరుపుకోవడం, జాతీయ పండుగల సందర్భాలలో ఆటపాటల పోటీలు, బహుమతులు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.