
హైదరాబాద్( Hyderabad) నగరంలో మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చిన రాజీవ్ స్వగృహ(rajiv swagruha) ప్రాజెక్ట్‌కు మంచి స్పందన లభిస్తోంది. లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరల్లో ఫ్లాట్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి నగరవాసుల నుంచి భారీగా స్పందన వస్తోంది.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి. భాస్కర్ రెడ్డి(C. Bhaskar Reddy) మాట్లాడుతూ, నగరంలోని బండ్లగూడ (Nagole–Bandlaguda), పోచారం (Pocharam) ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లాట్లు మార్కెట్ ధర కంటే సుమారు 40 శాతం తక్కువగా ఉన్నాయని తెలిపారు. బండ్లగూడలో 159 ఫ్లాట్లు, పోచారంలో 601 ఫ్లాట్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
ఇప్పటికే బండ్లగూడ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల కోసం 1,200 మంది ఫోన్ ద్వారా సంప్రదించగా, 700 మంది ప్రత్యక్షంగా ప్రాజెక్టును పరిశీలించారని వెల్లడించారు. అలాగే, పోచారంలోని ఫ్లాట్ల విషయంలో 800 మంది టెలిఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోగా, అందులో 300 మంది ప్రాజెక్టుకు విసిట్ చేశారని చెప్పారు.
బండ్లగూడ ప్రాజెక్టు దరఖాస్తులను జూలై 29వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు, జూలై 30న లాటరీ ద్వారా కేటాయిస్తామని, అదే విధంగా, పోచారం ఫ్లాట్లకు దరఖాస్తుల చివరి తేదీ జూలై 31గా నిర్ణయించగా, లాటరీ ద్వారా కేటాయింపు ఆగస్టు 1న నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని తక్కువ ధరకే సొంతిల్లు కలను నిజం చేసుకోవాలని ఆయన నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.