రంగారెడ్డి జిల్లా మీర్ పేట హత్య కేసు(Meerpet Woman Murder Case)లో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ నెల 15వ తేదీన భార్య వెంకటమాధవిని హత్య చేసిన గురుమూర్తి ఆనవాళ్లు తెలియకుండా డెడ్ బాడీని నరికి ముక్కలు చేసి, వేడి నీటిలో ఉడికించి, ఎముకలు పొడి చేసి సమీప చెరువులో పడేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ కీలక విషయం తెలిసింది. మాధవి, గురుమూర్తి గ్రామంలో గతంలో జరిగిన ఓ గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రకాశం జిల్లా రాచర్ల మండంలం జేపీ చెరువునకు చెందిన గురుమూర్తి, వెంకటమాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో సొంతూరిలో శుభకార్యాలు, పండుగలకు దంపతులు కలిసి వెళ్తుండేవారు. అలా మూడేళ్ల క్రితం ఓ సందర్భంలో సొంతూరు వెళ్లగా.. గురుమూర్తి ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పెద్ద గొడవ జరిగింది. ఇది కాస్త పెద్దల వద్ద పంచాయతీ వరకు చేరింది.
అంతా మీ వల్లే.. కాదు నీ వల్లే
అయితే పోలీసు కేసు కాకుండా మాధవి కుటుంబ సభ్యులు చొరవ చూపడంతో గొడవ అక్కడితో ఆగిపోయింది. కానీ తన భర్త చేసిన పని వల్ల ఊళ్లో పరువుపోయిందని మాధవి తరచూ బాధ పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే సొంతూరుకు వెళ్లడం మానేసింది. అయితే తన భార్య కుటుంబం వల్లే తన ఊరుకు వెళ్లలేకపోతున్నానని మాధవిపై గురుమూర్తి కోపంగా ఉండేవాడు. మూడేళ్లుగా ఏ పండక్కి కన్నవారి వద్దకు వెళ్లలేకపోతున్నామంటూ ఒకరినొకరు నిందించుకుంటూ తరచూ గొడవ పడుతుండేవారు.
యూట్యూబ్ లో వీడియోలు చూసి
ఈ నెల 15వ తేదీన కనుమ పండగరోజు కూడా ఇదే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. గొడవ తారాస్థాయికి చేరడంతో క్షణికావేశంలో గురుమూర్తి మాధవి తలను గోడకేసి బాదటంతో ఆమె చనిపోయింది. ఏం చేయాలో అర్థంగాక డెడ్ బాడీ వద్దే 6 గంటలపాటు కూర్చొని ఆనవాళ్లు తెలియకుండా డెడ్ బాడీ ఎలా మాయం చేయాలో యూట్యూబ్ లో వెతికాడు. అలా వెతుకుతున్న క్రమంలో కొన్ని వెబ్ సిరీస్ (Web Series) రెఫరెన్సులు రావడంతో ఆ సిరీస్ లు చూశాడు. వాటిని ప్రేరణగా తీసుకుని మాధవి మృతదేహాన్ని ముక్కలు చేసి మాయం చేసే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయాడు.






