Mana Enadu : టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు హాట్ టాపిక్స్ విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయితే.. మరొకటి మంచు ఫ్యామిలీ వివాదం. మంచు మోహన్ బాబు (Mohan Babu), ఆయన చిన్న తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో.. సీనియర్ నటుడు మోహన్ బాబు మీడియాతో అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. జర్నలిస్టుపై దాడి చేయగా అతడు గాయపడ్డాడు.
జర్నలిస్టుకు మోహన్ బాబు క్షమాపణ
ఈ క్రమంలో మంచు మోహన్ బాబు (Mohan Babu Apology) తాజాగా బహిరంగ క్షమాపణలు తెలిపాడు. ఆయన దాడి ఘటనలో జర్నలిస్ట్‌కు తీవ్రగాయాలు కాగా.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధర్నాకు దిగాయి. ఈ నేపథ్యంలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను మోహన్ బాబు కలిశాడు. అతడికి బహిరంగ క్షమాపణలు తెలిపాడు. అనంతరం అతడి కుటుంబాన్ని పరామర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పాడు. మెహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జర్నలిస్ట్ రంజిత్‌ను కలిసి పరామర్శించి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి
హైదరాబాద్ (Hyderabad) జల్పల్లి (Jalpally)లో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద ఈనెల 10న.. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా.. సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ.. ఓ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.








