
మిస్ వరల్డ్ కాంపిటేషన్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మాగీ తనను వేశ్యలా చూశారని సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసిన కేటీఆర్ తెలంగాణలో ఎక్కువగా మహిళలకు గౌరవం ఇస్తామన్నారు. తాము మహిళలను గౌరవిస్తామని, వారి వృద్ధికి సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఈ విధంగా మహిళలకు అవమానం జరిగితే తెలంగాణ రాష్ట్రం అంగీకరించదని అన్నారు. ఒక ఆడపిల్లకు తండ్రిగా ఇలాంటి అనుభవాలు జరకూడదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మాగీ ఆరోపణలు అర్ధరహితం
72వ మిస్వరల్డ్ పోటీల (Miss World Competition) నుంచి మిస్ ఇంగ్లాండ్ -2025 మిల్లా మాగీ అర్థంతంరగా తప్పుకోవడంపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే స్పందించారు. మిస్ ఇంగ్లండ్ మాగీ చేసిన ఆరోపణలు సరైనవి కావని ఒక ప్రకటనలో ఖండించారు. ఈ నెల ప్రారంభంలోనే మిస్ ఇంగ్లండ్ మాగీ తన తల్లి, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందని, ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెను తక్షణమే ఇంగ్లండ్ కు తిరిగి పంపించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
బ్రిటిష్ మీడియా తప్పుడు కథనాలు
కాగా మిస్ ఇంగ్లండ్ పోటీల నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మిస్ ఇంగ్లండ్ మొదటి రన్నరప్ మిస్ షార్లెట్ (Miss England runner-up Charlotte)గ్రాంట్ ఇంగ్లండ్ తరఫున పాల్గొనేందుకు మిస్ వరల్డ్ సంస్థ అనుమతి ఇచ్చింది. మిల్లా మాగీ మాట్లాడిన మాటలు బ్రిటీష్ మీడియా వక్రీకరించాయని మిస్ వరల్డ్ సంస్థ సీఈవో తెలిపారు. అంతకుముందు ఇక్కడి ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాలపై మాగీ పొగిడిన వీడియోను చూపించకుండా కావాలనే ఎడిట్ చేశారని ఆరోపించారు.