ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో (Mumbai 26/11) సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. అయితే రాణాను బిర్యానీ పెట్టి మేపొద్దని.. ప్రత్యేక సౌకర్యాలు కల్పించొద్దని.. వీలైనంత త్వరగా ఉరి తీయాలని యావత్ భారతావణి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాణా గురించి గతంలో ప్రధానంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
US declaring Tahawwur Rana innocent in Mumbai attack has disgraced the sovereignty of India & it is a “major foreign policy setback”
— Narendra Modi (@narendramodi) June 10, 2011
రాణాపై మోదీ ట్వీట్
2011లో ఈ కేసుకు సంబంధించి ముంబయి ఉగ్రదాడుల్లో రాణా (Thawwur Rana) ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేస్తూ అమెరికా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ దాడులకు కారణమైన ఉగ్ర సంస్థకు మద్దుతు ఇచ్చినందుకు రాణాను దోషిగా తేల్చింది. ఆ తీర్పుపై స్పందిస్తూ 2011 జూన్ 10వ తేదీన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ గుజరాత్ సీఎం హోదాలో ఉన్న నరేంద్ర మోదీ (Narendra Modi) నెట్టింట ఓ పోస్టు పెట్టారు.
శెభాష్ మోదీ జీ
‘ముంబయి ఉగ్రదాడిలో తహవ్వుర్ రాణాను నిర్దోషిగా యూఎస్ ప్రకటించడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. ఇది విదేశాంగ విధానానికి భారీ ఎదురుదెబ్బ.’ అంటూ మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రాణాను భారత్ తీసుకొచ్చిన నేపథ్యంలో నెటిజన్లు అప్పటి పోస్టును బయటకు తీశారు. ఈ పోస్టును షేర్ చేస్తూ ప్రధాని మోదీ దౌత్య విధానాలను ప్రశంసిస్తున్నారు.






