ఎన్టీఆర్ (NTR).. అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆయన సమ్మోహన రూపం. నటనకు రాజముద్ర. వెండితెరపై తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జాతిరత్నం. ప్రేక్షకుల ఆరాధ్యదైవం. తెలుగుసినీ చరిత్రలో ఆయనద సువర్ణాధ్యాయం. సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం.. ఏదైనా ఆయన దిగనంతవరకే. ‘Once He Steps In.. History Repeats’. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ (NTR Death Anniversary) గురించి ప్రత్యేక కథనం.
చాలా ఏళ్ల క్రితం ఎన్టీఆర్ సాహసం
హీరో అంటే ఎలా ఉండాలి.. స్టైలిష్ గా కనిపించాలి. వంద మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించాలి. బ్రాండెడ్ బట్టలు.. అదిరిపోయే సిక్స్ ప్యాక్ లుక్స్ తో అలరించాలి. కానీ కొంతమంది హీరోలు మాత్రం ఇవేం లేకుండా తమ నటనతో విభిన్న పాత్రల్లో మెప్పిస్తుంటారు. అలా చాలా ఏళ్ల క్రితమే ఎన్టీరామారావు తన పాత్రతో ఓ సాహసం చేశారు. ఓ పాత్ర కోసం ఏకంగా ఆయన డీగ్లామర్ గా కనిపించారు.
రాజు పేదలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్
1954లో వచ్చిన ‘రాజు- పేద (Raju Peda)’ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశారు. రాజులా ఓ పాత్రలో తన రాజసంతో ఆకట్టుకుంటే.. పోలిగాడు అనే దొంగ పాత్రలో డీ గ్లామర్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఆ సమయంలో ఇలాంటి పాత్ర చేయడానికి ఏ హీరో కూడా సాహసించలేదు. కానీ మొదటిసారిగా ఎన్టీఆర్ ఇలాంటి పాత్ర చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
ఛాలెంజ్ అంటే ఇష్టం
ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ గోనెగుడ్డలు ధరించారు. ముఖమంతా మసి పూసుకున్నారు. ఇవే కాకుండా ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో కూడుకున్నది. అయినా సరే ఎన్టీఆర్ తాను ఈ పాత్రలో నటిస్తానని ముందుకొచ్చారు. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలన్న కసితో ఉండే ఎన్టీఆర్ ఈ పాత్రకు వెంటనే జై కొట్టారు. అలా దర్శకుడు బీఏ సుబ్బారావు తన డైరెక్షన్ తో ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో విశ్వరూపం చూపించారు.







