పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)ని నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్ లోని పాకిస్థాన్ హై కమిషన్ వద్ద శుక్రవారం రోజున భారతీయులు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న పాకిస్థాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి భారతీయ నిరసనకారులను ఉద్దేశిస్తూ హెచ్చరిక చేశాడు. నిరసనకాలను చూస్తూ.. ‘గొంతు కోస్తా’మన్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గొంతు కోస్తాం అంటూ వార్నింగ్
పహల్గామ్ ఉగ్రదాడిని తెరవెనక నడిపించిన పాకిస్థాన్ ఇందులో తమ ప్రమేయం లేదంటూనే తాజాగా బహిరంగంగా బరితెగించింది. లండన్‌లోని పాక్ హైకమిషన్‌లో పాకిస్థాన్ ఆర్మీ, వైమానిక సలహాదారు (Pakistan Army Defence Attache) కల్నల్ తైమూర్ రహత్, భారతీయ నిరసనలకారులపై బహిరంగంగా బెదిరింపులకు దిగడం పాక్ ఆర్మీ బరితెగింపుతనాన్ని, నీచ బుద్ధిని, రక్త దాహాన్ని స్పష్టంగా చూపిస్తోందని భారతీయ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోతో పాక్ అసలు బుద్ధి బయటపడిందని అంటున్నారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిని యావత్ భారతావనితో పాటు ప్రపంచ దేశాలు ఖండించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఆయా దేశాల్లో నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే లండన్‌లోని భారతీయులు పాకిస్థాన్ రాయబార కార్యాలయం (Pakistan Embassy in UK) ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టి.. భారతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆందోళనకారులు.. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.






