ManaEnadu: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు(Digital arrests)ల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ ఇంటరాగేషన్(Online Interrogation), డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మేరకు గడిచిన 10 నెలల్లోనే ఏకంగా 3,237 మంది బాధితుల(victims)ను డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి రూ.237 కోట్ల వరకూ లూటీ చేశారు.
ఆన్లైన్ ఇంటరాగేషన్ పేరుతో చీటింగ్
సైబర్ చీటర్స్ ఢిల్లీ, ముంబై, UP, కోల్‌కతా కేంద్రంగా వరుసగా నేరాలకు పాల్పడుతుండగా ఇటీవల HYDకు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని (74) నుంచీ రూ.37 లక్షలు దోచేశారు. క్రైమ్ బ్రాంచ్, CBI, ED, కస్టమ్స్ అధికారులమని చెప్పుకుంటూ బ్లాక్ మెయిల్ చేశారు. స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్(Skype, WhatsApp video calls) చేసి ఉక్కిరిబిక్కిరి చేసి.. డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ ఇంటరాగేషన్ పేరుతో 10 నెలల వ్యవధిలోనే 3,237 మంది బాధితుల నుంచి రూ.237.11 కోట్లు దోచేశారు. వీటికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో ఇలా..
ఇదిలా ఉండగా నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే వ్యక్తి కర్నూలు నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలో 300 మందిని బురిడీ కొట్టించాడు. రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ నమ్మించి రూ.25 కోట్లు వసూలు చేశాడు. మరోవైపు ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సైబర్ క్రైమ్ పోలీసులు మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుంచి దేశవ్యాప్తంగా 3,200 సైబర్ మోసాలకు పాల్పడిన మరో హవాలా ఆపరేటర్ సైబర్ మోసగాడిని అరెస్టు చేశారు. అందుకే ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.