మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్.. హంతకుడిని పట్టించిన ఈగలు

ManaEnadu : “నీ రేంజు పెద్దదవనీ.. నా రేంజు చిన్నదవనీ.. నీ కింగ్​డమ్​నే కూల్చకుంటే కాదురా మగాన్ని” అంటూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాలో ఈగ పాట పాడుతూ ఉంటుంది. హీరో నాని చనిపోయి ఈగలా మారి తనను చంపిందెవరో హీరోయిన్​కు చెబుతాడు. అప్పుడు హీరోయిన్​ ఆ ఈగ (Eega) సాయంతో విలన్ అంతు చూస్తుంది. విలన్​ను ఈగ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. “ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ.. ఈజీ ఈజీ ఈజీగా తేరి జాన్ లేగా” అంటూ చివరకు విలన్​ను చంపేస్తుంది ఈగ. ఇప్పుడు ఈ ఈగ గోలేంటి అనుకున్నారా?

హంతకున్ని పట్టించిన ఈగ
అయితే ఆ సినిమాలో ఈగ విలన్​ను చంపేస్తుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే కథనంలో ఈగ ఓ హత్య కేసులో నిందితుడినే పట్టించింది. బడా బడా పోలీసు ఆఫీసర్లే పట్టుకోలేని హంతకుడిని చిన్న ఈగ ఎలా పట్టించింది అనేగా మీ డౌటు. మరెందుకు ఆలస్యం. ఈ స్టోరీ చదివేయండి. ఆ ఈగ మర్డర్ మిస్టరీని ఎలా చేధించిందో తెలుసుకోండి.

అతని చుట్టూ ముసిరిన ఈగలు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలో గత నెల 30వ తేదీన పని కోసం ఇంటి నుంచి బయల్దేరిన మనోజ్‌ ఠాకూర్‌ (26) అనే యువకుడు మరుసటి రోజు తప్రియా గ్రామంలోని ఓ పొలంలో మృతదేహమై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. విచారణ సమయంలో హత్యాస్థలంలో గుంపులో ఉన్న మనోజ్‌ మేనల్లుడు ధరమ్‌ ఠాకుర్‌(19)ని విచారించారు. అయితే పోలీసులు అతణ్ని విచారిస్తున్నప్పుడు అతడి దుస్తులపై ఎక్కువగా ఈగలు (Flies) వాలడం గమనించారు.

ఇదీ జరిగిన విషయం
అతణ్ని ఎందుకు అంతలా ఈగలు చుట్టుముట్టుతున్నాయని పోలీసులు తనిఖీ చేయగా దుస్తులపై రక్తపు మరకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్​ ల్యాబ్​ (Forensic Lab)కు పంపగా రక్తపు మరకలు నిర్ధారణయ్యాయి. పోలీసులు వారి స్టైల్లో విచారించగా.. మనోజ్​ను చంపింది తానేనని నిందితుడు అంగీకరించాడు. కోడి మాంసం, మద్యం కొనుగోలు చేస్తున్న సమయంలో విభేదం తలెత్తడంతో మనోజ్​ను పదునైన వస్తువుతో కొట్టి ధరమ్ పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో అతణ్ని అరెస్టు చేశారు.

Share post:

లేటెస్ట్