టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) గత కొంతకాలంగా యూట్యూబ్ లో ‘పూరి మ్యూజింగ్స్ (Puri Musings)’ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాడ్ కాస్ట్ లో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా తాజాగా ఆయన ఆరోగ్య పాఠాలు చెప్పారు. చల్లని నీటితో స్నానం చేయడం, సరైన వ్యాయామం, అప్పుడప్పుడు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఆయన తెలిపారు. ఇలా చేస్తే శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుందని చెప్పారు. ఇక తాజా పాడ్ కాస్ట్ లో ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుకున్న స్టోరీ చెప్పారు.
ఆటోఫజీ అంటే?
‘‘ఆటోఫజీ (Autophagy)’ గ్రీకు నుంచి వచ్చిన పదం. ఆటో అంటే సెల్ఫ్.. ఫజీ అంటే తినడం. ఆటోఫజీ అంటే.. సెల్ఫ్ ఈటింగ్ అని అర్థం. మన శరీరంలో ఉన్న పనికిరాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తింటుంది. ఆటోఫజీ అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హాని కలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని బయటకు పంపుతుంది. ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత మన శరీరానికి ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా యవ్వనంగా ఉంచుతుంది. ఇక క్యాన్సర్ లాంటి రోగాలు కూడా రాకుండా చేస్తుంది.
పూరి ఆరోగ్య పాఠాలు
‘‘మనం ఉపవాసం ఉన్నప్పుడు.. ఎక్సర్సైజ్ చేసినప్పుడు.. ఈ ఆటోఫజీ అనేది జరుగుతుంది. శరీరం పునరుత్తేజితమై మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉండండి. అలా చేస్తే మీలో ఇమ్యూనిటీ, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ఇంకా మంచిది. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు.’’ అని పూరి జగన్నాథ్ ఆరోగ్య పాఠాలు చెబుతున్నారు.







