సినిమా రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కారు అవార్డులో మరో కేటగిరీ యాడ్ అయింది. ఇక నుంచి ‘స్టంట్ డిజైన్’ (Stunt Design category) జాబితాలోనూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2027 నుంచి రిలీజ్ కానున్న మూవీస్ ను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనుంది. 100వ అకాడమీ (The Academy) అవార్డుల్లో ఈ జాబితాను అధికారికం చేయనున్నారు.
ఆస్కార్ పోస్టులో ఆర్ఆర్ఆర్ ఫొటో
తాజాగా ఆస్కార్ కొత్త లిస్టును ప్రకటిస్తూ.. ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఫొటోను ఉపయోగించింది. ఇలా హాలీవుడ్ చిత్రాల సరసన ‘ఆర్ఆర్ఆర్’ను చేర్చడం విశేషం. ఈ పోస్టర్లో మూడు సినిమాల ఫొటోలను ఉపయోగించి ఆస్కార్ ‘స్టంట్ డిజైన్’ గురించి వెల్లడించింది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆర్ఆర్ఆర్ (RRR)’, ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాల్లోని స్టంట్ల ఇమేజ్‌లతో దీన్ని అనౌన్స్ చేశారు.
100 ఏళ్ల నిరీక్షణ ఫలించింది
ఇది చూసిన తెలుగు ఆడియన్స్.. ఇది మన భారతీయ సినిమాకు దక్కిన గౌరవమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆస్కార్‌లో కొత్త కేటగిరీపై రాజమౌళి స్పందిస్తూ.. 100 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. దీన్ని సాధ్యం చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన జక్కన్న దీని పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ చూసి ఎంతో సంతోషంగా అనిపించిందని వెల్లడించారు.






