శబరిమల ఆలయంలోని (Sabarimala) అత్యంత పవిత్రమైన పదునెట్టాంబడి వద్ద పోలీసులు ఫొటోలకు ఫోజులివ్వడం వివాదాస్పదమైంది. భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు.. అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో కూర్చుని ఫొటో దిగడం సంప్రదాయాలకు పూర్తి విరుద్దమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబరు 24న మధ్యాహ్నం అక్కడ విధుల్లో ఉన్న 30 మంది పోలీసులు.. తమ డ్యూటీ ముగియడానికి ముందు పదునెట్టాంబడిపై స్వామికి వ్యతిరేకంగా నిలబడి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (abarimala photo controversy) ఈ ఘటనపై స్థానిక మీడియాలో కథనం రావడంతో కేరళ ఏడిజీపీఎస్ శ్రీజిత్ స్పందించారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా సన్నిధానం ప్రత్యేక అధికారిని ఆదేశించారు.
హైకోర్టు ఆగ్రహం
ఈ ఘటనపై కేరళ హైకోర్టు (kerala high court) సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమోదించబోమని పేర్కొంది. అలాగే శబరిమలలో భక్తుల వద్ద అధిక మొత్తంలో దుకాణదారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించింది. తరుచూ దుకాణాల్లో తనిఖీలు చేయాలని, ఎవరైనా ఎంఆర్పీ కంటే అధిక ఛార్జీలు వసూలుచేస్తున్నట్టు గుర్తిస్తే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
వారికి మాత్రమే అధిరోహించే అర్హత..
ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వీజీ థంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల ఆలయం అనగానే అక్కడ ఉండే 18 మెట్లు గుర్తుకొస్తాయని, మాల ధారణ చేసి, కఠోర నియమ నిష్ఠలు పాటించి, ఇరుముడితో వచ్చిన భక్తులకు మాత్రమే మెట్లను అధిరోహించే అర్హత ఉంటుందన్నారు. అలాంటి ఈ పవిత్రమైన మెట్లపై ఫోటో షూట్ చేయడం ఏమిటి? అని మండిపడ్డారు.
ఆ 23 మంది కన్నూర్ క్యాంప్‌కు అటాచ్
ఈ అంశాన్ని కేరళ ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఫోటో షూట్‌లో పాల్గొన్న 23 మంది పోలీసులను కన్నూర్ క్యాంప్‌కు అటాచ్ చేశారు.