సల్మాన్ ఖాన్ (Salman Khan).. ఈ పేరు బాలీవుడ్(Bollywood)లో ఒక బ్రాండ్. సల్లూభాయ్ సినిమాలకు కచ్చితంగా ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా కలగలిసిన వినోదాత్మక చిత్రాలను ఎంచుకోవడంలో ఆయన దిట్ట. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో అతనికి విపరీతమైన క్రేజ్ ఉంది. అతని డైలాగులు, డాన్స్ స్టెప్పులు ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తాయి. సల్మాన్ నటించిన “వాంటెడ్”, “దబాంగ్”, “భజరంగీ భాయిజాన్”, “సుల్తాన్” వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
తెలుగు వీర జవాన్ గాథలో సల్మాన్..
ప్రస్తుతం తెలుగు వీర జవాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు (colonel santhosh babu life story) జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ఒక కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో కల్నల్ సంతోష్ బాబుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అపూర్వ లాఖియా (Apoorva lakiya) దర్శకత్వం వహించనున్నారని తెలిసింది.
దేశభక్తి ఆధారంగా సాగే కథ..
2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ(Galwan valley)లో జరిగిన పోరాటంలో కల్నల్ సంతోష్ బాబు చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. ఆయన ఎలా పోరాడారు, తన సైనికులను ఎలా నడిపించారు, దేశం కోసం ఎలా ప్రాణాలర్పించారు అనే విషయాలను హృద్యంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ద్వారా సంతోష్ బాబు యొక్క త్యాగాన్ని, ఆయన చేసిన సేవను దేశ ప్రజలందరికీ తెలియజేయాలనేది చిత్ర యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
ఈ సినిమా కోసం గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలకు సంబంధించిన వాస్తవాలను, అప్పటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుంటున్నారని టాక్. సినిమాలో కేవలం యుద్ధ సన్నివేశాలే కాకుండా, సంతోష్ బాబు వ్యక్తిగత జీవితం, ఆయన సైన్యంలో ఎదిగిన తీరు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆయనకున్న అనుబంధం వంటి అంశాలను కూడా స్పృశించనున్నారని తెలుస్తోంంది.






