
Mana Enadu : ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, తబలా మ్యాస్ట్రోగా కీర్తి గడించిన జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Death) (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరగా.. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జాకిర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాకిర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
వాహ్ తాజ్ స్టోరీ ఇదే
ఆరు దశాబ్దాల తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఎంతోమంది సంగీత ప్రియులకు ఆరాధ్యమైన జాకిర్ పేరు వినగానే చాలా మందికి ఠక్కునే గుర్తొచ్చేది ‘వాహ్ తాజ్ (Wah Taj)’ అని. ఈ పదంతోనే ఆయన సంగీత ప్రియులకే కాకుండా యావత్ దేశంలోని ప్రతీ ఇంటికీ చేరువయ్యారు. 1990ల్లో ఆయన నటించిన బ్రూక్‌బాండ్ తాజ్‌మహల్ టీ యాడ్ (Taj Mahal Tea Add) చివరలో వాహ్ తాజ్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. అసలు ఈ యాడ్ వెనక ఉన్న స్టోరీ ఏంటీ? దీని గురించి జాకిర్ పంచుకున్న విశేషాలు ఏంటి? ఓసారి గుర్తు చేసుకుందాం..!
ఆయనకు వచ్చిన ఆలోచనే వాహ్ తాజ్
జాకిర్ హుస్సేన్ తబలా (Tabla Maestro Zakir Hussain) వాయిస్తుంటే చెవుల్లో తేనె పోసినట్లు ఉంటుంది. అందుకే ఆయన ప్రదర్శనను తిలకించే వారంతా ‘వాహ్ ఉస్తాద్’ అంటూ ప్రశంసలు కురిపించే వారు. ఈ ప్రశంస ఆధారంగానే హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ కంపెనీ ‘బ్రూక్‌బ్రాండ్ తాజ్ మహల్ టీ’ యాడ్ రూపొందించింది. హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్‌లో కాపీరైటర్‌గా పని చేసే కేఎస్ చక్రవర్తి అనే వ్యక్తికి వచ్చిన ఐడియానే ఈ వాహ్ తాజ్ యాడ్ కాన్సెప్ట్.
వాహ్ ఉస్తాద్ కాదు.. వాహ్ తాజ్
ఇందులోని ఒక యాడ్ లో.. తాజ్‌మహల్ ముందు జాకిర్ హుస్సేన్ (Zakir Hussain Taj Mahal Add) కూర్చుని తబలా వాయిస్తుండగా.. ‘తన కళను ఉత్తమంగా తీర్చుకునేందుకు ఈ మ్యాస్ట్రో సాధన చేస్తారు. అలాగే తాజ్‌మహల్ టీని కూడా ఉత్తమంగా అందించేందుకు ఎన్నోరకాల నాణ్యతా పరీక్షలు చేశాం’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ వస్తుంది. ఇక వీడియోలో చివరగా ఆయన కళకు మైమరిచిపోయిన ఓ అమ్మాయి తాజ్ మహల్ టీ పౌడర్ తో చేసిన టీని ఓ కప్పులో అందిస్తూ ‘వాహ్ ఉస్తాద్’ అని అంటుంది. దానికి ఆయన బదులిస్తూ ‘వాహ్ ఉస్తాద్ కాదు.. వాహ్ తాజ్ (Wah Taj Add) అనండి’ అని అనడంతో యాడ్ పూర్తవుతుంది.
సెన్సేషనల్ యాడ్
ఇక మరో యాడ్‌లో ఓ బాలుడితో కలిసి జాకిర్ తబలా వాయిస్తుండగా.. ఆ బుడతడి ప్రతిభను మెచ్చి ‘వాహ్ ఉస్తాద్’ అంటారు జాకిర్. దానికి ఆ బాలుడు ‘అరె హుజూర్ వాహ్ ఉస్తాద్ కాదు.. వాహ్ తాజ్ అనాలి’ అని సమాధానమివ్వడంతో అందరూ నవ్వులు చిందిస్తారు. ఈ యాడ్స్ తో తాజ్‌మహల్ టీ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. టీ పౌడర్ కు సంబంధించిన యాడ్స్ లో తాజ్ మహల్ టీ యాడ్ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది.