Mana Enadu : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు(ys jagan disproportionate assets case)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని.. తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసుల వివరాలను విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని ఆదేశిస్తూ.. అన్ని వివరాలతో రెండు వారాల్లో దాఖలు చేయాలని అఫిడవిట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకింత ఆలస్యం
జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) గతంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం (Supreme Court) ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా.. ఇన్నేళ్లపాటు ట్రయల్ ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసం ప్రశ్నించింది.
ఈనెల 13కు తదుపరి విచారణ
డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. పెండింగ్లో ఉన్న అంశాల వల్లే ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. పెండింగ్ వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.






