Mana Enadu:ఇటీవల కేరళ( Kerala)లోని వయనాడ్‌లో కురిసిన భారీవర్షాలు విధ్వంసం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి దాదాపు 400 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే వందల మంది మరణానికి కారణమైన ఈ విలయం తర్వాత అక్కడ సహాయ చర్యల్లోనూ అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాటిని అధిగమించేందుకు ఆర్మీ అక్కడ యుద్ధప్రాతిపదికన వంతెన నిర్మించింది. ఈ వంతెన నిర్మాణంలో ఓ మహిళా ఆర్మి అధికారి కీలకంగా వ్యవహరించారు. ఆమె మహారాష్ట్రకు చెందిన మేజర్ సీతా షెల్కే.
నాడు రామయ్య.. నేడు ‘‘సీత’’మ్మ
చూరల్మలై, ముండక్కై గ్రామాలను కలిపే వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. సీతా షెల్కే ఆధ్వర్యంలో ఆర్మీ అక్కడ రికార్డు సమయంలో తాత్కాలిక ఐరన్ బ్రిడ్జి నిర్మించింది. దీంతో మేజర్ సీతా షెల్కే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెను అక్కడి ప్రజలు ‘‘ఆనాడు రాముడు సీతమ్మ కోసం వానరులతో సాయంతో వారధి నిర్మిస్తే.. ఈనాడు ఏకంగా సీతమ్మ మా కోసం దిగివచ్చి సిబ్బంది సాయంతో ఈ వారధి నిర్మించిందని’’ అక్కడి స్థానికులు కొనియాడారు. మరోవైపు సోషల్ మీడియా యూజర్లు ఆమెను ‘టైగర్’ అంటూ కొనియాడారు.
ప్రధాని ఏరియల్ సర్వే..
ఇదిలా ఉండగా వయనాడ్‌లో ప్రకృతి ప్రళయంతో విలవిల్లాడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అక్కడి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారితోపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడి ఘటన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్మీ నిర్మించిన వంతెనపై నడుస్తూ అక్కడ జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. కేంద్రం తరఫున బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. కాగా ఈ 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని భారత ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’ 36 గంటల్లోనే నిర్మించిందని, దీంతో చూరల్మలా-ముండక్కై గ్రామాల మధ్య సహాయక చర్యలు వేగవంతమయ్యాయని అధికారులు ప్రధానికి వివరించారు.