Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ ఉంటుంది. ఇక శ్రీవారి దర్శనం కోసం భక్తులు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఇక నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్దగా ఇబ్బందులు పడకుండా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు (Tirumala Tickets) బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది.
ఎలాంటి సిఫార్సులు లేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచన చేసింది. శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవలకు ఉన్న ధరలను సైతం ప్రక్షాళన చేసి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది.
దీనికి అనుగుణంగా స్వామివారి దర్శనాలు, సేవలు మొదలు దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే ఇతర సౌకర్యాలు, సదుపాయాలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను సమీక్షించి వాటిని ప్రక్షాళన చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే వాట్సాప్ (Tirumala WhatsApp Tickets) ద్వారా శ్రీవారి భక్తులు క్షణాల్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
మరోవైపు తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదని టీటీడీ (TTD) పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులను భక్తులు గుర్తించారని తెలిపింది. ఇక కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుకే సీఎం చంద్రబాబు బయటపెట్టారని, విషయం తెలిశాక కూడా దానిని రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యేదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.