టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం (Ma Inti Bangaram), రక్త్ బ్రహ్మాండ్ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు ప్రకటించినప్పటి నుంచి వీటి నుంచి మరో అప్డేట్ రాలేదు. మరోవైపు సామ్ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సారథ్యంలో ‘శుభం (Subham)’ అనే ఓ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇక త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఎందుకీ తేడా?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత (Samantha) పాల్గొంది. ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటుల సమాన పారితోషికాల గురించి మాట్లాడింది. ఇప్పటికే ఈ విషయంపై చాలా సార్లు సామ్ స్పందించింది. తాజాగా మరోసారి మాట్లాడుతూ రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్స్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని చెప్పింది. ఇద్దరూ ఒకేలా కష్టపడుతున్నప్పుడు పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించింది. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినా రెమ్యునరేషన్ విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
నాతోనే మార్పు మొదలు
‘‘ సినిమా ఇండస్ట్రీలో నన్ను ఇబ్బంది పెట్టే విషయాల్లో ఒకటి పారితోషికం (Heroines Remuneration). ఇందులో మార్పు తీసుకురావాలని నేను భఆవిస్తున్నాను. మార్పు నాతోనే మొదలవ్వాలనే ఉద్దేశంతో నా సంస్థలో హీరోహీరోయిన్ల పారితోషికం విషయంలో తేడా రాకుండా చూసుకుంటున్నాను. సమాన పారితోషికం ఇవ్వాలని కాదు.. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. ’’ అని సమంత చెప్పింది. మరోవైపు ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణసంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో నిర్మిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’లో పనిచేసిన వారందరికీ లింగ భేదం లేకుండా సమానంగా వేతనాలు ఇచ్చినట్లు దర్శకురాలు నందిని రెడ్డి తెలిపారు.






