IPL 2025లో నేడు వీకెంట్ కావడంతో రెండు ఆసక్తికర మ్యాచులు జరగనున్నాయి. లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ (LSG vs GT)తో తలపడనుంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో సన్ రైజర్స్(PBKS vs SRH) అమీతుమీ తేల్చుకోనుంది. పాట్ కమిన్స్(Pat Cummins) కెప్టెన్సీలో ఆడుతున్న SRHకు ఈ సీజన్ ఆశించినంతగా లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.
సన్‌రైజర్స్‌దే పైచేయి..
మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డుల(Head to Head Records) గురించి మాట్లాడుకుంటే, SRH జట్టు పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్(PBKS) జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
అందరి చూపు వారిపైనే..
లక్నో సూపర్ జెయింట్స్(LSG), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో అందరి చూపు పించ్ హిట్టర్ నికోలస్ పూరన్(Nicholas Pooran) హైదరాబాది పేస్ గన్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ల పోరుపైనే ఉంది. ఇద్దరూ తమతమ రంగాల్లో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్(GT) నాలుగు వరుస విజయాలతో 8 పాయింట్లతో ముందుంది, నెట్ రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్(DC) కంటే పైచేయి సాధించింది. మరోవైపు, LSG 6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నా మంచి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి టేబుల్‌లో పైకి దూసుకెళ్లాలని పంత్(Pant) సేన భావిస్తోంది.






