బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనపై ముంబయి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా ఓ మహిళను అరెస్టు చేశారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు వినియోగించిన సిమ్ కార్డు ఓ మహిళ పేరుతో ఉన్నట్లు గుర్తించిన అధికారులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆమెతో పరిచయం
బంగాల్ లోని నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళకు సైఫ్‌పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు.. అప్పటినుంచి ఈ మహిళతో టచ్‌లో ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో సదరు మహిళను అరెస్టు చేశారు.
ఆ ఫింగర్ ప్రింట్స్ అతడివి కావు
మరోవైపు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టైన షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు, దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలడం లేదనే న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.







