
గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు.. జాప్యం ఎందుకు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (BRS Working President KTR) నిలదీశారు. (Assembly Sessions) అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఒక సారి మాత్రమే రైతు బందు చెల్లించామని చెప్పడం చాలా అభినందనీయమన్నారు. రైతుబంధు (Rythu Bandhu) రూ. 21,283 కోట్ల దుర్వినియోగం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని మంత్రే చెప్పారు. 2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలు అని మీరు ఇచ్చిన నివేదికలో ఉంది. రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగింది. పత్తి పంట, కంది పంట దాదాపు 8నెలలు ఉంటుంది కాబట్టి రైతు బంధు మీరు ఒకసారి ఇస్తారా లేక రెండు సార్లు ఇస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు.
పీఎం కిసాన్ గురించి ఎలా మార్గదర్శనం
రైతుబంధుకు కోతలు పెట్టే ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ గురించి మంత్రి తుమ్మల (Minister Tummala Nageswara Rao) ఎందుకు ప్రస్తావించారు. పీఎం కిసాన్ మార్గదర్శకాలు మీకు మార్గదర్శకం అయితే.. 25 శాతం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా (Rythu Bharosa) వర్తిస్తది. పీఎం కిసాన్ మార్గదర్శకాలు పాటించమని మంత్రి తుమ్మల చెబుతున్నారు. మరి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేందుకు రైతుబంధుపై చర్చ ఎందుకు..? రైతుబంధుకు కోతలు పెట్టం అనుకుంటే ఎందుకీ చర్చ అని ప్రశ్నించారు.
కంది, పత్తి పంటలకు రైతు బంధు ఇవ్వరా?
కంది, పత్తి 8 నెలల పంట. పామాయిల్ పంటను విపరీతంగా ప్రోత్సహించాం. పామాయిల్ పంటకు, మామిడి తోటలకు రైతుభరోసా( Rythu Bharosa) ఇస్తారా..? ఇవ్వరా.. అని ప్రభుత్వాన్ని అడిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మూడు పంటలు సాగు చేసే వారు ఉన్నారు. మరి మూడు పంటలకు రైతుభరోసా ఇస్తారా..? ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) మాట్లాడుతూ.. మూడో పంటకు ఎందుకు ఇవ్వరు అని మా ప్రభుత్వాన్ని నిలదీశారు. కాబట్టి మూడో పంటకు రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..? అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని మంత్రిని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.