లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. ఇంకో నెల రోజుల్లో ప్రక్రియ మొదలు కానుంది. నిర్వహణకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టగా.. పార్టీలు సైతం ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నానా పాట్లు పడుతున్నాయి. అయితే, ఓటరు మాట ఎటున్నా.. ప్రతి ఎన్నికలకు ముందు వచ్చినట్టే ఈ ఎన్నికల్లోనూ ప్రీపోల్ సర్వేల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం గెలిచి తీరుతుందని సర్వేలు కుండబద్ధలుకొడుతున్నాయి. ఏపీ శాసనసభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి ఎక్కువ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రో గా చెప్పుకునే ఇండియా టుడే – ఆజ్ తక్ మీడియా, సీ ఓటర్ సంస్థల ఉమ్మడి సర్వేలో ఉత్తర భారతదేశంలో పూర్తిగా కమలం వైపే నిలవగా.. దక్షిణ భారత్‌లో ప్రాంతీయ పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధిపత్యం చలాయించే అవకాశముందని వెల్లడించాయి. ఇదే సర్వే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే పైచేయని చెప్పుకొచ్చింది.
ఇటీవలె టైమ్స్ నౌ సర్వేలోనూ భాజపా 360కి పైగా స్థానాలు గెలుస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ కు 60 నుంచి 70 రావడం కూడా కష్టమేనని పేర్కొనగా.. 10 స్థానాలు తెలంగాణా నుంచే వస్తాయని వెల్లడించింది.