సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth Reddy) గౌతమ్ అదానీ (Gautam Adani) ఫొటోలతో కూడి ఉన్న టీ షర్టులు వేసుకుని అసెంబ్లీలోకి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు ఎదుటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి (arrest of BRS MLAs) పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, మిగతా వారు అదానీ ఫొటోలతో ఉన్న టీ షర్టులు ధరించి వెళ్లారు. మేము ఇక్కడ అదే అదానీ టీషర్టు ధరించి వెళితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. లగచర్లలో రైతుల ఇబ్బందులు తెలపడానికి అసెంబ్లీకి వెళుతున్నాం. రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేసినందుకు ప్రశ్నించేందుకు సభకు వెళుతున్నాం. మమ్మల్ని అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డకుంటారా? ఇది సమంజసమా అని కేటీఆర్ మీడియా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అదానీ రేవంత్ బంధాన్ని బయటపెడతామని భయపడుతున్నారు
అదానీకి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారని, అదానీ-రేవంత్ బంధాన్ని బయటపెడతామని పోలీసులను అడ్డు పెట్టుకొని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ కడుతున్నారన్నారు. రాహుల్ గాంధీకి ఒక నీతి.. రేవంత్ రెడ్డికి మరో నీతా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. అదానీ ఫొటో ఉన్న టీషర్టులు ధరించి కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ కు వెళ్లారు. దిల్లీలో రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కాంగ్రెస్ నేతలు ఆ టీషర్టులు వేసుకొని వెళ్తే మీకు ఫర్వాలేదు. రాష్ట్రంలో మేం నిరసన తెలుపుతూ టీ షర్టులు ధరిస్తే మీకు ఇబ్బందేంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అసెంబ్లీ గేటు వద్దే నిరసన కొనసాగించారు. గౌతమ్ రేవంత్ బొమ్మ ఉన్న టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పోలీసులు తరలించారు.