తెలుగు, తమిళ చిత్రసీమల్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన రాంకీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తనదైన స్థానం సంపాదించుకుంటున్నాడు. అసలు పేరు రామకృష్ణ అయినప్పటికీ, సినీ ప్రపంచంలో రాంకీగా పాపులర్ అయ్యాడు. ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు కీలక పాత్రల్లో మెప్పిస్తున్నాడు.

తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించిన రాంకీ, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో నటించిన సెంథూర పూవే సినిమా, తెలుగులో సిందూర పువ్వు పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

హీరోగా మారిన క్యారెక్టర్ ఆర్టిస్టు రాంకీ, 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో హీరోకు గాడ్‌ఫాదర్ పాత్రలో నటించి ప్రత్యేకంగా మెప్పించాడు. ఆ తర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా, నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ, తాజాగా విడుదలైన లక్కీ భాస్కర్ వంటి సినిమాల్లోనూ నటించాడు.

ఇదిలా ఉండగా, రాంకీ వ్యక్తిగత జీవితం కూడా చాలా మందికి ఆసక్తికర అంశం. ఎందుకంటే ఆయన భార్య కూడా ఒకకాలంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఆమె ఎవరో కాదు.. నిరోషా. శ్రీలంకలో జన్మించిన నిరోషా, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో నటించింది. తెలుగులో నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.
సినిమా షూటింగుల సందర్భంగా పరిచయం అయిన రాంకీ, నిరోషా ప్రేమలో పడి కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కొంతకాలం గోప్యంగా ఉంచారు. వీరి పెళ్లిని తరువాత బంధువులే మీడియాకు తెలిపారు. మరొక విశేషం ఏంటంటే.. నిరోషా ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ సోదరి కావడం.






