Mana Enadu:ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు సంబంధించి మొదలైన నిరసనలు ఏకంగా ప్రధానమంత్రి పీఠాన్నే కదిలించాయి. వారి డిమాండ్ల మేరకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా.. ఏకంగా ప్రభుత్వమే అంగీకరించినా.. ఇంతటి ఆందోళనలకు కారణమైన ప్రధానిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు ఏకంగా 300 మంది ప్రాణాలు తీశాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని షేక్ హసీనా గద్దెదిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి.. వాటికి దారి తీసిన కారణాలు ఏంటి.. ఓసారి చూద్దాం..
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడినవారి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బంగ్లా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయం స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆవామీ లీగ్ పార్టీ (హసీనా నేతృత్వంలోని) మద్దతుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని.. అందుకే రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు ఉవ్వెత్తున ఉద్ధృతమవ్వడంతో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్ లో హింస తీవ్రస్థాయిలో చెలరేగడంతో.. ప్రభుత్వం కల్పించిన 30 శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని ఆదేశిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించడంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని అంతా అనుకున్నారు. కానీ దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఘర్షణలతో దాదాపు 300 మంది మరణించారు.
అయితే ఆందోళనకారుల విధ్వంసంపై ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విధ్వంసాలకు పాల్పడేవారు నిరసనకారులు కారు… ఉగ్రవాదులంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో రాజీనామా చేసిన ప్రధానమంత్రి షేక్ హసీనా.. దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.