Mana Enadu:మనదేశంలో 25 ఏళ్లు దాటగానే యువతకు పెళ్లిళ్లు చేసేస్తుంటారు తల్లిదడ్రులు. అమ్మాయిలకైతే కొన్ని ఇళ్లలో 20 ఏళ్లు దాటగానే సంబంధాలు చూడటం షురూ చేస్తారు. ఇక 27 ఏళ్లు దాటితే అబ్బాయిలను ముదిరిన బెండకాయల్లా చిన్నచూపు చూస్తారు. ఒకవేళ 30 ఏళ్లు దాటితే.. ఇక ఆ యువకులకు మామూలుగా టార్చర్ ఉండదు. ఇక ఇష్టమో కష్టమే 30 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల పోరు పడలేకనో.. ఇంకేదో కారణంతోనో మొత్తానికైతే పెళ్లి చేసేసుకుంటున్నారు.
అయితే చైనా యువత మాత్రమ నో పెళ్లి.. నో పిల్లలు అంటున్నారట. సోలో బతుకే సో బెటర్.. వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ పెళ్లికి నో చెప్పేస్తున్నారట. ఇప్పుడు ఇదే ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. వివాహాలకు రివార్డులు ప్రకటిస్తున్నా.. అక్కడి యువత కల్యాణం చేసుకునేందుకు కనీస ఆసక్తి చూపడం లేదట. గతంలో దేశ జనాభాలో నంబర్ వన్ గా ఉన్న చైనా.. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది.

ఇక ఇప్పుడేమో ఓవైపు జననాల రేటు పడిపోతుంటే మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిది డ్రాగన్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఈ ఏడాదిలోని తొలి ఆరు నెలల్లో కేవలం 34 లక్షల జంటలు మాత్రమే వివాహ బంధంలో అడుగుపెట్టాయట. చైనాలో ఉద్యోగావకాశాలు తగ్గుతుండటం.. పెళ్లి చేసుకుంటే పిల్లలు.. ఇతర ఖర్చులు పెరుగుతాయని.. అదో పెద్ద తలనొప్పని యువత భావించడమే దీనికి కారణమట. మరోవైపు సరిపడా జాబ్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే వివాహాలు చేసుకోవాలనే ఆలోచన వల్ల కూడా పెళ్లిళ్లు తగ్గుతున్నాయి.
2014 నుంచి ఆ దేశంలో వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోందని, కొవిడ్ మహమ్మారి అనంతరం మరింత తగ్గుదల కనిపిస్తోందని డ్రాగన్ ప్రభుత్వం అందోళన వ్యక్తం చేస్తోంది. గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు తగ్గిపోతుండటంతో .. పెళ్లిళ్లు చేసుకునేవారికి, పిల్లలు కనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినా యువత పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదట.








