కోటా కల్లోలం.. బంగ్లాదేశ్ లో సైనిక పాలన.. రాజీనామా చేసి భారత్‌కు షేక్ హసీనా

ManaEnadu:రిజర్వేషన్ల కోటాపై వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో విఫలమైన షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో బంగ్లాలో సైనికాధిపతి జనరల్‌ వకార్‌-ఉజ్‌-జమాన్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.

ఐదుసార్లు బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా రాజీనామా చేశారని ప్రకటించగానే.. వందల మంది వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు.  గత రెండు రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో 300 మందికిపైగా మరణించడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. 1971లో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న 30శాతం రిజర్వేషన్లపై ఈ ఆందోళనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

ఇక షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లగానే.. ఆమె అధికారిక నివాసంపై వందల మంది ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. ‘గణభవన్‌’లోని సామగ్రిని ఎత్తుకెళ్లారు. కుర్చీలు, సోఫాలు. చివరకు కూరగాయలను కూడా తీసుకెళ్లడం సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. అంతటితో ఆగకుండా  ధన్‌మోండీలోని అవామీ లీగ్‌ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హసీనా తండ్రి ముజిబుర్‌ రెహ్మాన్‌ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు. 

అయితే షేక్ హసీనా మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ అన్నారు. తన రక్షణ, కుటుంబ క్షేమం కోసం ఆమె దేశం విడిచి వెళ్తున్నారని తెలిపారు. వెనుకబడిన దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా ఆమె పని చేశారని వెల్లడించారు. 

ఇక సైనిక పాలన అధికారంలోకి రావడంతో సైన్యాధిపతి జమాన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ సంక్షోభంలో ఉందని.. తాను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యానని తెలిపారు. దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు ఆందోళనలను విరమించాలని.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

 

Share post:

లేటెస్ట్