సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 2026 నుండి పదో తరగతి(10Th Class) బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం (జూన్ 25) సీబీఎస్‌ఈ అధికారికంగా ఆమోదం తెలిపింది. కొత్త విధానం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థులకు రెండుసార్లు పరీక్షలు రాయడానికి అవకాశం లభించనుంది.
బోర్డు పరీక్షల తొలి విడతను ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరు కావడం విద్యార్థులందరికీ కచ్చితంగా తప్పనిసరి. రెండో విడత పరీక్షలను మే నెలలో ఆప్షనల్‌గా నిర్వహిస్తారు. మార్కులు మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యే వీలుంటుంది. రెండు దశల్లో ఎవరికి మంచి స్కోర్ వస్తే ఆ స్కోర్‌నే ఫైనల్‌గా పరిగణనలోకి తీసుకుంటామని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
ఈ విధానం నూతన జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా ఉండేలా రూపొందించామని సీబీఎస్‌ఈ పరీక్షల నియంత్రణాధికారి సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, విద్యార్థులకు రెండవ ప్రయత్నం ఇచ్చే అవకాశంగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో మొదటి దశ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌లో, మేలో జరిగే రెండో దశ పరీక్షల ఫలితాలు జూన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రెండో దశ పరీక్షల్లో సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, భాషల వంటి మూడు సబ్జెక్టుల వరకు మాత్రమే విద్యార్థులు రాయవచ్చు. శీతాకాలంలో చదివే విద్యార్థులకు రెండు దశలలో ఒకదానికైనా హాజరయ్యే అవకాశం కల్పించారు. అయితే, అంతర్గత మూల్యాంకనం మాత్రం సంవత్సరం మొత్తం ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు.
ఇప్పటికే ఈ విషయంపై బోర్డు ఫిబ్రవరిలో ముసాయిదా నిబంధనలను విడుదల చేసి, పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర వాటాదారుల నుండి అభిప్రాయాలను స్వీకరించింది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తాజాగా అధికారిక ఆమోదం లభించింది. గత నెలలోనే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు, వారికి సానుకూలమైన విద్యావాతావరణాన్ని కల్పించేందుకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.






