Mana Enadu : శబరిమల (Sabarimala) అయ్యప్పస్వామి దర్శనానికి దేశనలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరతారు. ముఖ్యంగా ఇరుముళ్లతో అయ్యప్ప స్వాములు శబరిమలకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్ల(Sabarimala Trains)ను కూడా ఏర్పాటు చేసింది. అయినా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ రైలు సేవలు భక్తులకు సరిపోవడం లేదు.
శబరిమలకు 28 రైళ్లు
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు శబరిమలకు పోటెత్తుతుండటంతో మరికొన్ని రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే యోచన చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 28 రైళ్ల సర్వీసులను శబరిమల భక్తుల (Sabarimala Devotees) కోసం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం; కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపుర్ నుంచి కొల్లం వరకు ఈ రైలు సేవలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
డిసెంబరు 11 నుంచి రైలు సేవలు
డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు అడ్వాన్సు బుకింగ్స్ శుక్రవారం (డిసెంబర్ 6వ తేదీ) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. రైళ్ల నంబర్లు, సర్వీసులు అందించే తేదీలు, టైమింగ్స్ ను తన వెబ్ సైట్ లో పొందుపరిచారు. ప్రయాణికులు వీటిని తెలుసుకుని ఈ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.






