Mana Enadu : హైదరాబాద్ మహానగరం పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టి అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. అయితే నివాసాలను కూడా హైడ్రా కూల్చివేస్తోందని (Hydra Demolitions) వార్తలు వస్తున్నాయి. బాధితులు కూడా మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏళ్ల పాటు కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కట్టుకున్న ఇంటిని క్షణాల్లో కూల్చివేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు.
కూల్చివేతలన్నీ హైడ్రావి కావు
ఈ నేపథ్యంలో హైడ్రా తాజాగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కూల్చివేతలకు హైడ్రాను ఆపాదిస్తున్నారని మండిపడింది. ఈ మేరకు హైడ్రా పరిధి గురించి తన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. హైడ్రా అంటే కూల్చివేతలే కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Ranganath) అన్నారు. దాని పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకేనని స్పష్టం చేశారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రకృతి వనరులు కాపాడడంలో హైడ్రా ..
* నగరం ఒకప్పడు లేక్ సిటీగా పేరుండేది. గొలుసుకట్టు చెరువులు సాగు, తాగు నీరందించేవి.
* నగరంలో చెరువులను పునరుద్ధరించడం, వరద నీరు ఆయా చెరువుల్లోకి ఎక్కడికక్కడ చేరేలా చూడడం.
* నగరంలోని వరదనీటి కాలువలు, నాలాలు ఆక్రమణలు… pic.twitter.com/zNkUFjIICp— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024
హైడ్రా పేదల జోలికి వెళ్లదు
హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదని రంగనాథ్ స్పష్టం చేశారు. అలాగే నివాసం ఉండే ఇళ్లను కూల్చదని పునరుద్ఘాటించారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావని తేల్చి చెప్పారు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలని వెల్లడించారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు (Ponds), కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల (Floods) సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టం హైడ్రా విధి అని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
కూల్చివేతలు కాదు..చెరువుల పునరుద్దరణ హైడ్రా లక్ష్యం
పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదు..
ప్రజలు గమనించాలి.. అసత్య ప్రచారాలు నమ్మొద్దు..* హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే.
* నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024