Mana Enadu : ‘అంత మహా బలుడైనా అమ్మ వొడి పసివాడే శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే’ అని ఓ పాటలో చెప్పినట్లు, ‘దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అని మన పెద్దలు చెప్పినట్లు.. ఎంత గొప్పవాళ్లైనా తల్లి ముందు పసిబిడ్డలే. దేశాన్నేలే నాయకుడైనా.. పొట్టకూటికి లేని పేదవాడైనా తల్లి ముందు అందరూ సమానులే. ప్రతి ఒక్కరు కన్నతల్లికి కంటిపాపే.
అమ్మ.. అనే పేరు వింటేనే మనకు ఏదో తెలియని భావోద్వేగం పెల్లుబికి వస్తుంది. అమ్మ గురించి మాట్లాడాలంటే కళ్లలో నుంచి నీరు రాకుండా పెదవి నుంచి మాట పెగలదు. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని.. జీవితాంతం కళ్లలో పెట్టుకుని కాపాడుకునే అమ్మ అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే. ఆ తల్లి రుణం ఎప్పటికీ ఎవరూ తీర్చుకోలేరనేది జీవిత సత్యం.
అమ్మ గురించి మనం మాట్లాడుతుంటే.. మన కళ్లు చెమరుస్తాయి. అదే అమ్మ మన గురించి మాట్లాడుతుంటే ఆ కళ్లలో మమత ఉప్పొంగుతూ కనిపిస్తుంది. అమ్మ తన పిల్లల గురించి మాట్లాడే ఆ తరుణం ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో విలువైనది. దాని గురించి వివరించడానికి మాటలు సరిపోవు. ఆ దృశ్యం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఆ క్షణం అలా అమ్మను చూస్తూ మైమరిచిపోవాల్సిందే.
అలాగే ఇప్పుడు ఓ తల్లి తన బిడ్డల గురించి మాట్లాడింది. ఆ బిడ్డలు సాధారణ పౌరులు కాదు. ఒకరు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి వందల సినిమాలు చేసి తనకంటూ టాలీవుడ్ లో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుని మెగాస్టార్ అనే బిరుదును తెచ్చుకున్న కొణిదెల చిరంజీవి (Megastar Chiranjeevi). మరొకరు అన్న అడుగు జాడల్లో నడుస్తూ.. తమ్ముడికి వెన్నంటి నిలిచే మరో నటుడు, రాజకీయ నేత కొణిదెల నాగబాబు (Naga Babu). ఇంకొకరు తన అన్నలు చూపిన బాటలో నడుస్తూ.. తనకంటూ ఓ మార్గాన్ని ఏర్పరుచుకుని.. తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇటీవలే ఓ మొదటి అడుగు వేసిన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).
జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మ కి
ఈ ఒక రోజు ఏంటి .. ప్రతి రోజు అమ్మ దే.. ఈ జీవితమే అమ్మది.
Happy Mother’s Day ! pic.twitter.com/wo68QAdiAq— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2024
ఈ ముగ్గురు ఆణిముత్యాలను కన్న మాతృమూర్తి అంజనా దేవి (Anjana Devi). ఆ తల్లి ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన ముగ్గురు కుమారుల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి తాను పాల్గొన్న స్పెషల్ ఇంటర్వ్యూలో తన కుమారుల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
ఈ ఇంటర్వ్యూకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలోనే జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ కానుంది. ఈ వీడియోలో అంజనా దేవి పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి కూడా మాట్లాడారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోనూ మీరూ చూసేయండి.






