Mana Enadu : ప్రపంచ కుబేరుల జాబితా (Worlds Richest People List)లో మరోసారి టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) 256 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి జాబితాలో మెటా (Meta) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) తన జోరు చూపించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. జెఫ్ బెజోస్‌ను దాటి తొలిసారిగా ఈ స్థానానికి చేరుకుని జుకర్ బర్గ్ అరుదైన ఘనత సాధించారు.
14వ స్థానంలో ముకేశ్ అంబానీ
206 బిలియన్ డాలర్ల సంపదతో జుకర్ బర్గ్.. అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) (205 బిలియన్ డాలర్లు)ను వెనక్కి నెట్టారు. ఇక ఈ జాబితాలో భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 107 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానంలో నిలిచారు. 100 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ (Gautam Adani) 17వ స్థానంలో ఉన్నారు.
రాణించిన మెటా షేర్లు
ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించడంతో పాటు.. రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ఇక ఏఐ చాట్‌బాట్‌లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్ లాంగ్వేజ్ (Large Language) మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు 23శాతం పెరగడంతో.. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో సంస్థ షేరు విలువ ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకి 582.77 డాలర్ల వద్ద ముగిసింది.