Mana Enadu : తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో(Chennai Air Show)లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన మెగా ఎయిర్ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు బీచ్ (marina beach) వద్దకు పోటెత్తారు. అయితే తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కపోత, ఎండవేడిమి తాళలేక నలుగురు సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మరణించారు.
ఐదుగురు మృతి.. 230 మందికి అస్వస్థత
ఈ ఘటనలో దాదాపు 230 మంది అస్వస్థతకు గురై చెన్నైలోని 3 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్‌బాబు, దినేశ్, మరొకరిగా పోలీసులు గుర్తించారు. ఎయిర్ షో (Chennai Air Show Tragedy)కు దాదాపు 13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసినా సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఇబ్బంది ఎదురైంది.
మెట్రో.. బస్టాపుల్లో భారీ రద్దీ
చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడం వల్ల మెరీనా బీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్ (Light House Metro Station), వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్‌లు సందడిగా మారాయి. షో ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడం వల్ల రద్దీ ఏర్పడింది. అయితే ఎయిర్ షోలో చోటుచేసుకున్న విషాదంతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వారి మృతికి అవి కారణాలు కావు
తొక్కిసలాట(Stampede), నిర్వహణ లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ ఆ విమర్శలకు బదులిచ్చింది. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన చాలా మంది డిశ్చార్జి అయ్యారని డీఎంకే నేత శరవణన్ తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు.






