Mana Enadu : అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ (RBI) ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. అనుకున్నట్లుగానే పదోసారి కూడా వీటిని యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ (అక్టోబర్ 9వ తేదీ) ప్రకటించారు.
వరుసగా పదోసారి యథాతథం
రెపో రేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసగా పదోసారి ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.
వృద్ధిరేటు అంచనా 7.2 శాతం
2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం ఉంటుందని శక్తికాంతా దాస్(Shaktikanta Das) తెలిపారు రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో 7.4శాతంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో 7.3శాతంగా వృద్ధి రేటు అంచనా వేసినట్లు చెప్పారు.
ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం
మెరుగైన వర్షపాతం నమోదు, సరిపడా నిల్వలతో ఈ ఏడాది చివరి నాటికి ఆహార ద్రవ్యోల్బణం(Food Inflation) తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇక సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరగొచ్చని .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
తయారీ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ తదితర కారణాలతో తయారీ రంగం వృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఆర్థిక రంగం స్థిరంగా ఉందని శక్తికాంతా దాస్ తెలిపారు. మరోవైపు బ్యాంకుల కార్యకలాపాలు (Bank Servies) బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.







