Mana Enadu : బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రాణాలకు ముప్పుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్టార్ హీరోను చంపుతామంటూ పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఇక తాజాగా సల్లూ భాయ్ మరోసారి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇటీవలే మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ(Baba Siddique)ని హత్య చేశామని చెప్పుకుంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను మరోసారి బెదిరించింది. తమ గ్యాంగుతో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఆగంతకులు ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు గురువారం రాత్రి బెదిరింపు మెసేజ్ చేశారు.
అంతకన్నా దారుణంగా చంపేస్తాం
“ఈ వార్నింగ్ ను లైట్ తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలని భావిస్తున్నా ఆయన రూ.5కోట్లు మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే బాబా సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన చావును ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పోలీసులకు పంపిన మెసేజ్ లో దుండగులు బెదిరించారు. అప్రమత్తమైన ముంబయి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
గతంలో సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు
ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఇది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పనేనని పోలీసులు(Membai Police) అనుమానించగా.. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందంటూ అన్మోల్ పోస్ట్ పెట్టాడు.






