విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి JEE మెయిన్‌ ఎగ్జామ్​లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవ్

Mana Enadu : జేఈఈ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్. జేఈఈ మెయిన్ పరీక్ష(JEE Main Exam) విధానంలో కీలక మార్పులు జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్​లో ఎన్టీఏ(NTA) మార్పులు చేసిన విషయం తెలిసిందే.

సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి కేవలం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చిన సర్కార్.. 2024 వరకు అదే విధానాన్నికొనసాగించింది. తాజాగా 2025 నుంచి పరీక్షలో ఈ ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని ప్రకటించింది. 2021కి ముందున్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని..  సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇస్తామని.. ఐదింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమాచారం లేదా అప్డేట్ల కోసం, విద్యార్థులు NTA వెబ్‌సైట్ nta.ac.in లేదా JEE మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.inని సంప్రదించాలని సూచించింది. 

జేఈఈ మెయిన్‌ ర్యాంకు(JEE Main Ranks)ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు ఇస్తుండగా.. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉండేది. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలుండేవి.

ఇక కరోనా సమయం(Corona Pandemic)లో విద్యార్థుల కోసం ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అలా జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండగా.. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాల్సి ఉండగా.. సెక్షన్‌ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆ ఛాయిస్‌ ఉండదని తాజాగా ఎన్టీఏ స్పష్టం చేసింది.

Share post:

లేటెస్ట్