Mana Enadu : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు(Musi Project)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుపై ముందడుగే కానీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపానన్న ఆయన.. ఈ చర్చతో ప్రజలకు అవగాహన కలిగిందని.. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు.
నవంబర్ 1న మూసీ పునరుజ్జీవం పనులు
“ప్రాజెక్టు పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచించాం. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు (Musi Beautification) పనులు ప్రారంభిస్తాం. బాపూఘాట్ నుంచి పనులు స్టార్ట్ చేస్తాం. నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తాం. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకూ సిద్ధం.” అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేటీఆర్ అభ్యంతరమేంటి?
మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్‌ఎస్ (BRS Party) వాళ్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. తనను కలవటం అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. విపక్షాలు ప్రతిపాదనలు సూచించవచ్చని చెప్పారు. 55 కి.మీ. మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృతమవుతుందని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో?
మూసీ కోసం భూములిచ్చే వారికి 100 శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని తెలిపారు. మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉందన్న ఆయన.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ (KTR) నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామని.. మూసీపై కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao), ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






