Mana Enadu : గ్రూప్-1 ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపికబురు చెప్పారు. త్వరలోనే గ్రూప్-1 నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. 563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నామని తెలిపారు. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ (TGPSC) పని చేస్తోందన్న ఆయన.. దీన్ని రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదని స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో’ భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకొచ్చాయి
కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao) ఉద్యోగాలు ఊడితేనే.. యువతకు ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని యువత నమ్ముతోందని చెప్పారు. 21 నుంచి 35 ఏళ్ల లోపు మనం చేసే పనులే భవిష్యత్తును నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యోగాలిచ్చాం
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ (CM Revanth Reddy).. పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాల గురించి పూర్తి అవగాహన ఉన్న అధికారులే సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఏడాదిలోనే 14 వేల మందిని వైద్య ఆరోగ్య శాఖలో నియమించడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.
మా ప్రాధాన్యత విద్య, వైద్యానికి
“గత పదేళ్ల పాలనను మీరు ప్రత్యక్షంగా చూశారు. కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత.. విద్య, వైద్యం. 6500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించి ఆ దిశగా పని చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలన(BRS Govt)లో గతంలో ఆర్ఎంపీ డాక్టర్‌ను, తహసీల్దార్‌ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించారు. పునరావాస కేంద్రాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మార్చేశారు. చిన్న ఉద్యోగి పెద్ద పెద్ద ఉద్యోగులను నియమించలేరుగా? బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాల్లేవు. ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా.. పేపర్ లీక్‌ను అరికట్టలేకపోయారు.’’ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.






