Mana Enadu : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Sessions 2024) ఉభయ సభలు ఇవాళ మూడో రోజు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనల మధ్యే శాసనసభ కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇవాళ సభకు నల్ల చొక్కాలు, బ్యాడ్జీలు ధరించి.. చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈ క్రమంలోనే చర్చకు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి.
రేపటికి శాసనసభ వాయిదా
అయితే విపక్షాల నిరసనల మధ్యే సభ కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే శాసనసభ (Telangana Assembly Bills) మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇవాళ్టి సభలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ (Telangana GST Amendment Bill) బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లులకు సభ ఆమోదం తెలపడం గమనార్హం. అనంతరం రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం బుధవారం ఉదయం 10 గంటలకు శాసనసభ వాయిదా పడింది.
శాసనమండలి రేపటికి వాయిదా
మరోవైపు అయితే లగచర్ల రైతులను (Lagacharla Farmers Protest) తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ‘ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు శాసనమండలిలోనూ లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కానీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. సభ్యుల ఆందోళనల మధ్య సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లగచర్ల ఘటనపై చర్చకు పట్టు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) మాట్లాడుతూ.. రైతుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. మండలి ఆవరణలో తమ నిరసనను కొనసాగించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






