టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను గత నెల 23వ తేదీన తెలంగాణ హైకోర్టు (Telangana HC) కొట్టేసింది. ఈ నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో ఊరట
తన చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తో వివాదం నేపథ్యంలో మీడియా కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మీడియా ప్రతినిధి గాయపడి ఆసుపత్రి పాలవ్వడంతో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది.
సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు
అయితే ఓవైపు కోర్టు ఇచ్చిన గడువు ముగియడం, మరోవైపు పోలీసులు ఇచ్చిన గడువు కూడా ముగియడంతో మోహన్ బాబు అరెస్టు (Mohan Babu Arrest) ఖాయమంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఆయన ఇండియాలోనే లేరని.. విదేశాలకు వెళ్లారనే మాటలూ వినిపించాయి. కానీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆయన తన విద్యాసంస్థ విద్యానికేతన్ స్కూల్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రస్తుతానికి ఈ కేసులో ఊరట లభించినట్టైంది.






