హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇవాళ ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయన త్వరలోనే ఈడీ విచారణకు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో కేటీఆర్.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో కేటీఆర్ (Supreme Court)కు చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో క్వాష్ పిటిషన్ పై తక్షణ విచారణ అవసరం లేదని అభిప్రాయపడిన ధర్మాసనం.. ఈనెల 15వ తేదీన విచారిస్తామని పేర్కొంది.







