తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal)కు షాక్. త్వరలోనే ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ (Professor Jayashankar Telangana Agricultural University) సిద్ధమవుతోంది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులను తిరిగి వర్సిటీకి చెల్లించాలంటూ పేర్కొంటూ మరో రెండ్రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం వర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
రూ.61 లక్షలు చెల్లించాల్సిందే
సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో వర్సిటీ నుంచి తీసుకున్నట్లు అధికారులు లేఖలో పేర్కొన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అందులో తెలిపారు. అయితే ఆమె అద్దెకు తీసుకున్న వాహనం నాన్ టాక్స్ కాదని, కనీసం ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదని లేఖలో పొందుపరిచారు.
అది వ్యక్తిగత వాహనం
పవన్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉన్న వ్యక్తిగత వాహనం అని ఆడిట్ విచారణలో వెల్లడైంది. సీఎంవో స్మితా సభర్వాల్ ఆఫీస్ నుంచి ప్రతి నెల వాహనం అద్దె రశీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం కూడా ఉంది.
న్యాయనిపుణుల సూచన మేరకు చర్యలు
ఈ విషయంపై వివరణ కోరగా స్మితా సభర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ఆచార్య అల్దాస్ జానయ్య తెలిపారు. ఏజీ ఆడిట్ ఆధారంగా ఇంటర్నెల్ ఆడిట్ జరిపించామని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి.. ప్రభుత్వ పెద్దలు, న్యాయనిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.






