
ఈనెల 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (Telangana 10th Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (Khammam Collector) మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, TSRIES/మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, KGBV SOs, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ , MIS & CCOలు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పరీక్షల సమయంలో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
తల్లిదండ్రులకు ఖమ్మం కలెక్టర్ సూచనలివే
- మీ పిల్లలతో ప్రేమగా ఉండండి. శాంతంగా మాట్లాడండి. వారు ఒత్తిడికి గురి కాకుండా స్నేహంగా మెలగండి.
- పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు చదువు తప్ప ఇతర పనులేం చెప్పకండి.
- సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మార్గనిర్దేశం చేయండి.
- సెల్ ఫోన్ లు, టీవీలను దూరంగా ఉంచి, వారికి చదువుకునే వాతావరణాన్ని కల్పించండి.
- పిల్లలకు పాలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి. బయట ఫుడ్ కు దూరంగా ఉంచండి.
- పిల్లలను నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించండి. ఎట్టి పరిస్థితుల్లోను ఇతర పిల్లలతో పోల్చి నిరుత్సాపరచకండి.
- సరైన సమయానికి నిద్రపోయి తగినంత విశ్రాంతి తీసుకునే విధంగా చూడండి.
- పిల్లలను పరీక్షల పేరుతో భయానికి, ఒత్తిడికి గురి చేయకండి.
- ఉన్నత ఫలితాలను పొందటానికి నైపుణ్యం, క్షమత అత్యంత అవసరం. వాటిని ప్రోత్సహించండి.
- నేటి వరకు పిల్లలు పరీక్షలకు చక్కగా సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించేందుకు తగినంత కృషి చేశారు. కాబట్టి వారు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా చేయడం ప్రస్తుతం మన బాధ్యత.