
2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Budget 2025)ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,04,965 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టిన ఆయన.. ఇందులో వ్యవసాయ శాఖకు (Telangana Agriculture Budget) భారీగా నిధులు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో 24,439 కోట్లు వ్యవసాయానికి కేటాయించినట్లు ప్రకటించారు. ఇక ఇందులో రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలకు కూడా భారీగా కేటాయింపులు జరిపినట్లు తెలిపారు.
రైతులకు గుడ్ న్యూస్
2025-26 వార్షిక బడ్జెట్ లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రైతు భరోసా (Rythu Bharosa) పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం రూ.18వేల కోట్లు కేటాయించింది. రైతు బీమా పథకం కోసం రూ.1,589 కోట్లు కేటాయింపులు జరిపింది. ఇక భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని (Indiramma Athmeeya Bharosa Scheme) అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏడాదికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12 వేల రూపాయలు చెల్లించే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
పంట బోనస్ రూ.500
“ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మా ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసింది. 2 లక్షల లోపు రుణాలను మాఫీ (Runa Mafi) చేసింది. ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616.89 కోట్ల రుణ మాఫీ చేశాం. దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందడానికి మార్గం సుగమమైంది. రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తున్నాం. దీంతో గత ఖరీఫ్‌తో పోల్చితే.. సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది.” అని భట్టి వివరించారు.