IPL 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నష్టాలను ఎదుర్కొన్న అనంతరం ఫ్రాంచైజీ కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు జట్టు బౌలింగ్ కోచ్(Bowling Coach)ను మార్చేసింది. భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ (Varun Aaron)ను సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. 2026 సీజన్‌కు గాను వరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు సన్‌రైజర్స్ అఫిషియల్ ఎక్స్ (X) హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్(Dale Steyn) తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్(NZ) ఎడమచేతి వాటం మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్(James Franklin)ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన SRH.. అతని హయాంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా కొత్త బౌలింగ్ కోచ్‌గా మాజీ భారత్ పేసర్ వరుణ్‌ను నియమించింది.
A fiery addition to our coaching staff! Welcome Varun Aaron as our new bowling coach 🔥🧡#PlayWithFire pic.twitter.com/qeg1bWntC5
— SunRisers Hyderabad (@SunRisers) July 14, 2025
ఝార్ఖండ్ తరపున చివరిసారిగా బరిలోకి..
2011-2015లో 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత్‌కు వరుణ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది జనవరి 5న గోవా(Goa)తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో ఝార్ఖండ్ తరపున అతను చివరిసారిగా బరిలో దిగారు. ఇటీవల కాలంలో కామెంటరీ బాక్స్‌లో తన అద్భుతమైన క్రికెట్ జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచనలతో వరుణ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరుణ్ ఇంగ్లండ్‌లో ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్(India-England Test series)కు కామెంటరీ చెబుతుండగానే ఆయన నియామకానికి సంబంధించి సన్‌రైజర్స్ ప్రకటన విడుదలైంది.






