మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’(Vishwambhara ) అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. చివరి షెడ్యూల్లో ఓ ప్రత్యేక సాంగ్ ను చిత్రీకరించగా, ఇందులో చిరంజీవితో కలిసి చిందులేయనున్న నటి ఎవరనేది మేకర్స్ రివీల్ చేయలేదు.

అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్(Mouni Roi) స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో చిరంజీవితో కలిసి చేసిన స్పెషల్ సాంగ్ గురించి పోస్ట్ చేస్తూ.. “లెజెండరీ యాక్టర్ చిరంజీవి సార్ పక్కన డ్యాన్స్ చేయడం గర్వంగా ఉంది. ఈ అద్భుత అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను,” అని పేర్కొన్నారు. అలాగే షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలు, రిహార్సల్స్ వీడియోలు కూడా ఆమె షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ తర్వాత కొద్దిసేపటికే మౌని రాయ్ దాన్ని డిలీట్ చేయడంతో, నెట్టింట వైరల్ అయిన ఈ విషయాన్ని దాచడం మేకర్స్‌కు కుదర్లేదు. అధికారికంగా ప్రకటించేశారు.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, సౌరవ్ లోకేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించగా, స్పెషల్ సాంగ్‌కి మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్ కంపోజ్ చేశారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.






